దేవాలయాలపై దాడులు చేసినవాళ్లని పట్టుకోలేరు…

తిరుపతిలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు

• వైసీపీకి ఓటేస్తే విగ్రహాలు ధ్వంసం చేసినవారికి వత్తాసు పలికినట్లే… శ్రీ వేంకటేశ్వర స్వామికి ద్రోహం 

  చేసినవాళ్లం అవుతాం 

• రేషన్ డోర్ డెలివరీ లేదుగానీ… చైనాకి ఎర్ర చందనాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు 

• దేశ సరిహద్దుల్లో చైనా మన సైనికుల్ని చంపుతుంటే… వైసీపీ పాలనలో ఎర్ర చందనం చైనాకు వెళ్లిపోతుంది 

• మనం కట్టే పన్నులు వైసీపీ వాళ్ల సిమెంట్ కంపెనీలకు…. సారా అడ్డాలకు వెళ్లిపోతుంటే మౌనంగా ఉండలేను 

• సీఎం చిన్నాన్న హత్య కేసులో దోషులను పట్టుకోరు… కోడి కత్తి కేసులు ఏమైందో తెలియదు

• అన్ని కులాలకు నిలబడినట్లే… బలిజలకు అండగా నిలుస్తాం 

• తిరుపతి దశ దిశ మారాలంటే బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి రత్న ప్రభ గారిని గెలిపించాలి 

• తిరుపతి బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు 

153 పైగా దేవాలయాలపై దాడులు జరిగితే ఏ ఒక్కరినైనా దోషులుగా పట్టుకోలేని ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని జనసేన అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. వైసీపీకి ఓటు వేస్తే దేవాలయాలు కూల్చిన వారికి వత్తాసు పలికినట్టవుతుందని, కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వాళ్లమవుతామని అన్నారు.  తిరుపతి దశ, దిశ మారాలంటే జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ గారిని గెలిపించాలని కోరారు. వైసీపీ అభ్యర్ధిని గెలిపించినా ఆయన పార్లమెంటులో బలంగా మాట్లాడలేడని, అదే రత్నప్రభగారిని గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పార్లమెంటులో బలంగా గళం విప్పగలరని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో  బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ గారికి మద్దతుగా శనివారం సాయంత్రం శంకరంబాడి సర్కిల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎంపీగా ఉంటూ చనిపోయిన వైసీపీ నేత శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 

అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ఒక రూపాయి సంపాదిస్తే అందులో 48 పైసలు టాక్స్ కింద పోతాయి. రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, బడులు బాగుండాలని, అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉండాలని, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని ట్యాక్సులు కడితే… ఆ ట్యాక్సులు వీళ్ల సిమెంటు ఫ్యాక్టరీలకు, సారా అడ్డాలకు వెళ్లిపోతుంటే చేతులు కట్టుకొని కూర్చొనే వ్యక్తిని కాదు. కష్టమో, నష్టమో పోరాటం చేస్తాను. అన్యాయం జరిగినప్పుడు నోరు ఎత్తకపోతే ఆ అన్యాయం మరింత పెట్రేగిపోతుంది. వైసీపీ గూండాల పార్టీ అని శ్రీ సునీల్ దేవధర్ గారు ఎందుకు అన్నారు అంటే… వీళ్లు మనందరి దగ్గర ట్యాక్సులు వసూలు చేసి  వైసీపీ ఓటు బ్యాంకు అనుకున్నవాళ్లకు పంచిపెడుతున్నారు. 

• చదువుల సీమను ఫ్యాక్షనిజానికి మారుపేరుగా మార్చారు

రాయలసీమ అంటే సరస్వతి నేల, అన్నమాచార్యుల వారు నడయాడిన గడ్డ. శ్రీ కృష్ణదేవరాయులు ఏలిన నేల ఇది. అలాంటి నేలను దుర్మార్గానికి, దోపిడికి మారుపేరుగా మార్చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విన్నా పులివెందుల పంచాయతీ అంటున్నారు. పులివెందుల గొప్పతనం చాలా మందికి తెలియదు. 1892లోనే అక్కడ సరస్వతి నిలయం అనే గ్రంథాలయం ఉంది. కోస్తాంధ్రాలో 18 గ్రంథాలయాలు ఉంటే సీమలో 21 గ్రంథాలయాలు ఉండేవి.  అలాంటి చదువుల సీమను ఫ్యాక్షనిజానికీ, గుండాయిజానికీ, రౌడీయిజానీకి మారుపేరుగా మార్చేశారు. ఇవన్ని చూసి సగటు భారతీయుడిగా కడుపు మండింది.  వైసీపీ నాయకులకు తిరుపతి నడిబొడ్డు నుంచి చెబుతున్నాను… ఇది నవతరం. ఫ్యాక్షనిజానికి, గుండాయిజానీకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. జనసైనికులు, బీజేపీ నాయకులు అంతకంటే భయపడరు.  అన్యాయం జరిగితే ఎదురుతిరుగుతాం. రోడ్ల మీదకు వస్తాం. చొక్కాలు పట్టుకొని నిలదీస్తాం. ఇంత మంది యువత ఉన్నారు. సీమలో ఎక్కడికి వెళ్లినా వేల సంఖ్యలో బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు. మీలో ధైర్యం, ఆవేశం చచ్చిపోయాయా? ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా? మీలో పౌరుషం, ఆత్మగౌరవం లేవా? భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకు వెళ్లలేం. 

• సొంత చిన్నాన్నను చంపిన వ్యక్తుల్ని కాపాడేవారు రాజ్యాలేలుతున్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గూండాలాగే  మాట్లాడతారు. వీళ్ళు ఎమ్మెల్యేలా? గుండాలా? వీళ్ళ బెదిరింపులు చాలా ఎక్కువవుతున్నాయి. ముఖ్యమంత్రి బాబాయ్ శ్రీ వివేకానందారెడ్డి గారిని హత్య చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి వరకు ఎవరు చంపారో పట్టుకోలేకపోయారు. దోషులు ఎవరో తెలిసే ప్రభుత్వం పట్టుకోవడం లేదని శ్రీ వివేకానందారెడ్డి కుమార్తె శ్రీమతి సునీత గారు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. సొంత చిన్నాన్నను చంపిన క్రిమినల్స్ ను కాపాడే వ్యక్తులు రాజ్యాలు ఏలుతుంటే సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది. వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడికత్తితో శ్రీ జగన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. ఆ రోజు గవర్నర్ దగ్గర నుంచి అందరూ ఖండించారు. ఆ రోజు దీని మూలాలు కనిపెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇవాళ ఆ పార్టీ చేతిలో పోలీసు వ్యవస్థ మొత్తం ఉంది. ఆ ఘటన జరిగి రెండేళ్లు అయినా ఎందుకు కోడికత్తితో పొడిచాడో కారణం తెలుసుకోలేకపోయారు.  వైసీపీ చేసే తప్పులను వెనకేసుకొచ్చే వారు కూడా తప్పు చేసినట్లే. 

• మీరు కూల్చే ప్రతి వృక్షం మీ పతనానికి మెట్టవుతుంది

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డగోలుగా కూల్చేస్తున్నారు. ఢిల్లీ నుంచి నిధులు అవసరం లేదు… ఎర్రచందనం దుంగలు అమ్మితే చాలు అమరావతి కట్టేయొచ్చు అని ఆనాడు చంద్రబాబు అన్నారు. 8 వేల టన్నులు అమ్మితే రూ.16 వందల కోట్లు రూపాయిలు వచ్చింది.  వైసీపీ వాళ్లు కూడా ఇప్పుడు ఎర్రచందనం వేలం వేస్తాం, రూ.120 కోట్లు వస్తాయి అని చెబుతున్నారు. వేలకు వేలు ఎర్రచందనం చెట్లు కూల్చేస్తున్నారు. స్మగ్లర్లు అడవులను తగలబెట్టేస్తున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న దుంగలు పట్టుకెళ్లేవారు. ఇప్పుడు ఏకంగా లారీల్లోనే పట్టుకుపోతున్నారు. వీళ్లను ఆపేవాడు లేడు. వైసీపీ పాలనలో రేషన్ హోమ్ డెలివరీ అవుతుందో లేదో నాకు తెలియదు గానీ ఎర్రచందనం మాత్రం చైనాలో డోర్ డెలివరీ అవుతుంది. ఒకవైపు మన దేశ సరిహద్దుల్లో, గాల్వాన్ లోయలో చైనా వాళ్లు మన సైనికులు చంపుతుంటే… వీళ్లు మాత్రం చైనావాళ్ళకి ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నారు. ఇది వీళ్ల దేశభక్తి. సిగ్గుండాలి.  వృక్షో రక్షతి రక్షితః అంటారు. వైసీపీ వాళ్లు చెట్లను కూల్చేస్తున్నారు. మీరు కూల్చే ప్రతి చెట్టు మీ పతనానికి మెట్టు అవుతుంది గుర్తు పెట్టుకోండి.

• లక్షన్నర జీతం వచ్చే ముఖ్యమంత్రి రెండు వేలిచ్చి ఓటు కొంటున్నారు

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయాడు అని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. మీలాగా నాకు డబ్బులు తెచ్చే సిమెంటు ఫ్యాక్టరీలుగానీ, పేకాట క్లబులుగానీ లేవు. ముఖ్యమంత్రి జీతం రూ.లక్షన్నర వరకు ఉంటుంది. ఓటుకు మాత్రం రెండు వేలు ఇచ్చి కొంటున్నారు. వీళ్లకు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఒక ఎన్నికకు 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఖర్చు పెడుతుంది ఎవడబ్బ సొమ్ము? ఈ మధ్య మద్రాసు హైకోర్టు ఖజానా ఖాళీ చేస్తున్న రాజకీయ నాయకులకు చీవాట్లు పెట్టింది. వాళ్లకు 20ప్రశ్నలను సంధించింది. నన్ను కూడా సినిమాలు మానేసి మీలాగా అడ్డదారులు తొక్కమంటారా? నేను రాగిసంగటి తిని బతుకుతాను తప్ప అడ్డదారులు తొక్కను. పస్తులు పడుకుంటాను తప్ప అన్యాయం మాత్రం చేయను. 

• నేను ప్రజలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను

ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో వాళ్లకు గొంతునవ్వాలని రాజకీయాల్లోకి వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన సంచార జాతులు, మైనార్టీ వర్గాలు, అగ్రకులాల్లో పేదలు ఇలా అందరికి అండగా ఉండాలని పార్టీ పెట్టాను. కోట్లు ఇస్తానన్నా యాడ్స్ చేయలేదు. ఎందుకంటే నేను ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను తప్ప వాణిజ్య కంపెనీలకు కాదు. నాకు జ్ఞానంలేక కోట్లు వదులుకోలేదు. జ్ఞానంతోనే కోట్లు వదులుకున్నాను. నేను అంబాసిడర్ గా నిలబడితే దేశం, సమాజం కోసం నిలబడతాను తప్ప బ్రాండ్స్ కోసం కాదు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లోకి నువ్వు వచ్చి ఏం సాధిస్తావు అని అడుగుతున్నారు. నేను ఏం సాధించకపోయినా పర్వాలేదు. కానీ భావితరాలకు పవన్ కళ్యాణ్ అనే వాడు ఒకడు వచ్చి తన వంతు ప్రయత్నం చేశాడు   అనిపించుకుంటే  నా జీవితం ధన్యమయినట్లే. మనిషి బతకడానికి ఎన్నికోట్లు కావాలి. ఎన్ని ఎకరాలు కావాలి. ఎవడికైనా చివరకు మిగిలేది 6 అడుగుల నేల మాత్రమే. 

• ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారాలని సంకల్పిద్దాం

భారతీయ జనతా పార్టీ అంటే ముస్లిం వ్యతిరేక పార్టీ అంటారు. హిందూ దేశం అంటే అన్ని మతాలను కలుపువెళ్లే భావజాలం. తిరుపతి సీటును జనసేన వదులుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఇక్కడ నుంచి 1999లో బీజేపీ గెలిచింది. క్రిస్టియన్స్ కు వాటికన్ సిటీ ఎలాగో, ముస్లీంలకు మక్కా ఎలాగో… హిందువులకు తిరుపతి అలాగా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జాతీయ నాయకత్వానికి అప్పగిస్తే మంచిదని భావించి బీజేపీకి సీటు ఇచ్చాం. బీజేపీకి మన వంతుగా కొద్దిగా తోడ్పాటు అందిస్తే ఈ ప్రాంత దశ, దిశను మారుస్తుంది. ఒక చిన్న దుకాణంలో పనిచేసే వ్యక్తి ఈ రోజు దేశ ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు ఇదే తిరుపతిలో ఏడేళ్ల క్రితం జాతీయ నాయకత్వం మారాలని మనందరం సంకల్పించాం. ఫలితంగా ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచే మరోసారి సంకల్పం చేద్దాం ఆంధ్రప్రదేశ్  దశ, దిశా మారాలని కోరుకుందాం. వేలకోట్లతో ఓట్లు కొనే రాజకీయం పోవాలి. స్వచ్ఛమైన రాజకీయం రావాలని కోరుకుందాం.

• ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించండి

శ్రీమతి రత్నప్రభ గారు 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారిణిగా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఇప్పటికీ ఆమెను గుండెల్లో పెట్టుకుంటారు. ఐటి సెక్టార్ లో ఇవాళ మనం హైదరాబాద్ నగరంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఐటీ సంస్థలు వచ్చాయి అంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది శ్రీమతి రత్నప్రభ గారే. ఇవాళ తిరుపతి లోక్ సభకు పోటీ పడుతున్న అందరిలో ఎవరికి అర్హత ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందో నిర్ణయించుకోవాలి. బీజేపీ, జనసేన పార్టీ బలపరిచిన రత్నప్రభ గారిని గెలిపిస్తే ఆమె ఈ ప్రాంత సమస్యలపై బలంగా మాట్లాడగలుగుతారు. కేంద్ర పెద్దలను ఒప్పించి నిధులు తెప్పించగలుగుతారు. అదే వైసీపీ పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే… ఆయన పార్లమెంటులో మాట్లాడటానికి గొంతు ఉండదు. రాష్ట్రానికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు ఉండి ఏం చేశారు. ఆరు నెలలు కర్రసాము చేసుకొని మూలన ఉన్న ముసలమ్మను కొట్టినట్లు.. మా జనసైనికుల మీద కేసులు పెట్టడం, ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులు తీసేస్తాం.. నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే స్మగ్లింగ్ కేసులు పెడతాం అని బెదిరింపులకు పాల్పడడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. వైసీపీ నాయకులకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే సామాన్యుల మీద కాదు మీ ప్రతాపం నా మీద చూపించండి. మీరు ఎలాంటి గొడవలు పెట్టుకున్నా నేను సిద్ధం.  అధికారం బదలాయింపు జరగాలి అని ఆశించాను తప్ప ముఖ్యమంత్రి స్థానం కోసం ఏనాడు ఆలోచించలేదు. జనసైనికులు వారి గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే ముఖ్యమంత్రి స్థానం ఎక్కువ కాదు.  మీకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి పదవీ వస్తే అందరి కంటే ఎక్కువ సేవ చేస్తాను. అంతే తప్ప పదవి కోసం అర్రులు చాచను. పదవి వచ్చినా రాకపోయినా నా తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తాను .

• మార్పు రావాలంటే ఉప ఎన్నికల్లో ధైర్యంగా ఓటు వేయండి

పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి భార్య  మైసూరవారి పల్లె నుంచి సర్పంచ్ గా గెలుపొందారు. ఆమెపై దాడులు, బెదిరింపులు. అతంటితో అగకుండా రైల్వే కోడూరులో ముస్లీంలకు అవసరమయిన ఈద్గా, శ్మశాన వాటిక స్థలాన్ని మైసూరివారిపల్లిలో కేటాయించారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ స్థలం అంత పెట్టుకొని, మైసూరివారిపల్లెలో 17 ఎకరాలు కేటాయించడం ఏంటి? ముస్లీంలకు, స్థానికులకు గొడవలుపెట్టడానికి కాకపోతే. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న లక్ష్యంతో వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మిమ్మల్ని రోడ్ల మీదకు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోండి. రాయలసీమలో వెనుకబాటుతనం లేదు. వెనుకబాటు తనం ఉంటే కొద్ది మంది దగ్గర వేలకోట్లు ఎలా వచ్చాయి. సమాజంలో మార్పు రావాలంటే ఉప ఎన్నికల్లో ధైర్యంగా ఓటు వేయాలి. దేశకోసం ప్రాణ త్యాగాలు చేసిన నాయకులను స్మరించుకొని వాళ్ల వర్ధంతి, జయంతులకు పూలమాలలు, పాలాభిషేకాలు చేయడం కాదు. ఓపికగా క్యూలో నిలబడి కచ్చితంగా ఓటు వేయాలి. సమాజం మీద మీకు ప్రేమ, బాధ్యత లేదా? హక్కుల గురించి మాట్లాడే వారు బాధ్యత గురించి కూడా తెలుసుకోవాలి. డబ్బుల కోసం ఓట్లు వేయకండి. డబ్బులు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతాం. రెండు వేలకోసం బిడ్డల భవిష్యత్తును అమ్ముకోకండి. డాక్టర్ అంబేద్కర్ గారే నాకు స్ఫూర్తి. ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల కోసం నిలబడ్డారు.

• వైసీపీ నాయకులు వస్తే ఎందుకు ఓటేయాలని నిలదీయండి

వైసీపీ నాయకులు ఓట్లు అడగటానికి వస్తే ఎందుకు ఓట్లు వేయాలని అడగండి. 150పైగా దేవతా విగ్రహాలను అపవిత్రం చేసినందుకా? లేకపోతే పూజించే విగ్రహాలకు అసుద్దం పూసినందుకా? రామా అంటే దేశం మొత్తం కదులుతుంది. అలాంటి రాముడి శిరచ్ఛేదనం చేసిన దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. రథం దహనం చేసిన వారిని కనిపెట్టలేకపోయారు. ఆంజనేయ విగ్రహం చేతులు విరగొడితే ఆయన ఏమైనా అడిగాడా అని మాట్లాడతారు. దుర్గమ్మవారి రధంలోని వెండి సింహాలు పోతే వాటితో మేడలు, మిద్దులు కట్టుకుంటార అంటూ ప్రశ్నించారు. హిందుమతం కాకపోయి ఉంటే మీరు అలా మాట్లాడేవారా?    కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బంటుపల్లి గ్రామంలో శ్రీ చాంద్ బాషా అనే ముస్లిం 400 ఆవులతో గోశాల నడుపుతున్నారు. గోమూత్రం, పేడతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. అది నా దేశం గొప్పతనం.

• అమాయకులు బలవరాదనే రామతీర్ధం వెళ్లలేదు

రాముడి శిరస్సు ఖండించినా రామతీర్ధానికి వెళ్లకపోవడానికి కారణం బాధ లేక కాదు. ఆవేదన లేక కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను రోడ్ల మీదకు వెళ్తే నావల్ల అమాయకులు ఎక్కడ బలవుతారో అన్న ఆలోచనతోనే వెళ్లలేదు. విగ్రహాలు కూల్చిన దోషులు పది మందే ఉంటారు. దాని వల్ల ఏ మతం వారు అయినా సరే అమాయకులు బలవకూడదు. నేరస్తుల్ని పట్టుకోవడంలో, అందుకు టెక్నాలజీ వాడుకోవడంలో రాష్ట్ర పోలీసులకు అవార్డులు, సర్టిఫికెట్లు వస్తాయి. అయితే ఆలయాలపై దాడులు చేసినవారిని మాత్రం పట్టుకోలేరు.

• బలిజలు బెదిరించే కొద్ది బలపడతారు

తిరుమలలో బలిజ కులస్తులను వైసీపీ నాయకులు చాలా హింసిస్తూ ఉన్నారని తెలిసింది. బలిజలవి చిన్న బతుకులు, వారి దగ్గర సిమెంటు ఫ్యాక్టరీలు లేవు. ఫోటో షాపులు పెట్టుకొనో, ట్యాక్సీలు నడుపుకోనో బతుకుతారు. సామాన్య వ్యక్తులు. వారిని మీరు బెదిరించడం. బీజేపీ-జనసేన కూటమికి ఓటేస్తే ట్యాక్సీ డ్రైవర్ల మీద ఎర్రచందనం కేసులు పెడతాం. లైసెన్సులు రద్దు చేస్తాం అంటూ రకరకాలుగా బెదిరిస్తున్నారు. రేషన్ కార్డులు, పథకాలు రద్దు చేస్తామంటే భయపడతారనుకున్నారా? మీరు బెదిరించేకొద్దీ బలిజలు బలపడతారు. భయపడరు. బలిజలే కాదు బోయలు, యాదవులు, మాల, మాదిగలు గానీ వెనుకబడిన సంచార జాతులుగానీ, మైనారిటీలుగానీ ఎవరైనా మీరు బెదిరించే కొద్ది బలపడతాం.. భయపడం. మీరు బలిజల్ని హింసించడం మానండి. బలిజల్ని భయపెట్టడం మానండి. నాకు అన్ని కులాలు మతాలు సమానం. ప్రత్యేకించి బలిజల్ని టార్గెట్ చేశారని చెబుతున్నారు. నేను మీకు మాటిస్తున్నాను. అన్ని కులాలతోపాటు బలిజలకు మేము అండగా ఉంటాం. అన్ని కులాల మాదిరి మేము మీకు నిలబడతాం. తిరుమలలో కొబ్బరికాయలు అమ్ముకునే వారిని, తినుబండారాలు అమ్ముకునే వారినా మీరు బెదిరించేది శ్రీ జగన్ రెడ్డి గారు. ఏ కులంవారయినా సరే తిరగబడడం నేర్చుకోకపోతే బానిసలుగానే బతకాల్సి వస్తుంది. బానిసలుగా బతకాలనుకుంటున్నారా, స్వేచ్ఛావాయువులతో బతకాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమిభారతిని అన్న సూక్తిని గుర్తు చేసుకుంటూ.. వైసీపీ కోటలు బద్దలయ్యేలా, ఎర్రచందనం వృక్షాలను చైనాకు అమ్ముడు పెట్టేసిన వైసీపీకి గుండెలు పిక్కటిల్లేలా ఒక్క సారి భారత మాతకి జేజేలు పలుకుదామని” అన్నారు.

ముఖ్యమంత్రి ఒక్క మాట మీదైనా నిలబడ్డారా?

• యువతకు ఉద్యోగాలేవీ? ఇంటింటికీ రేషన్ పంపిణీ ఏమైంది?

• తిరుపతి సభలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్

  శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

స్థానిక సంస్థల ఎన్నికలను నిజాయతీగా నిర్వహించలేక పారిపోతున్న వైసీపీ నేతలు ఇతరుల గురించి మాట్లాడటమా? అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రశ్నించారు. అధికార పార్టీకి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవాలి… కొత్తగా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ  “ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇస్తే జనసేన-బీజేపీ కూటమి తరఫున ఎన్ని అభ్యర్ధులను పోటీకి నిలబెడతామో, ఎలా గెలుస్తామో  చూపెడతాం. 14 నెలల క్రితం జరిగిన నామినేషన్ ప్రక్రియను దొడ్డిదారిన నోటిఫికేషన్ ఇచ్చి మూడు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కోర్టులో న్యాయపోరాటానికి దిగాం. అక్కడ అయినా న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు ధర్మాసనం మనకు అనుకూల తీర్పు ఇస్తుందని ఆకాంక్షిస్తున్నాం. అయితే జనసేన నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ఎన్నిక వచ్చినా సిద్ధంగా ఉండాలి. బాధ్యతగా వ్యవహరించాలి.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ప్రాంత భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో కచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ పార్టీ అగ్రనాయత్వంతో మాట్లాడినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆ నమ్మకం కలిగింది. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మన ప్రాంతానికి మేలు జరగాలి, పెట్టుబడులు రావాలి. ఇప్పటికే ఎంతో మంది యువత ఉపాధి కోల్పోయారు. వారందరికీ ఉపాధి రావాలి. ప్రస్తుత పాలకులు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అసలు ఏ మాట మీద నిలబడ్డారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇంటింటికీ రేషన్ ఇవ్వలేదు. చేస్తున్న ప్రతి కార్యక్రమం ఒక కుటుంబానికి లబ్ది చేకూరే విధంగా చేపడుతున్నారు. రోజుకు రూ. 500 కోట్లు అప్పు తెచ్చి ఖజానాని డొల్ల చేశారు. మధ్యం అమ్ముకున్నారు.  ఇసుక అమ్ముకున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బిల్డింగులు కూడా అమ్ముకుంటారు. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి అవసరమా? మార్పు రావాలి. మార్పు రావాలి అంటే  మీలో ఆ బాధ్యత పెరగాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం నిలబడి పని చేయాలి. ఓటు వేయాలి. వేయించాలి.

ఈ ప్రాంతంలో మన బలిజ సోదరులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు ఆ సమాచారం వచ్చింది. కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికార పక్షం వేధింపులకు లోనవుతున్న సోదరులందరికీ నూటికి నూరు శాతం అండగా నిలబడతాం. మొన్నటికి మొన్న మైసూరివారిపల్లి ప్రజలు మహిళా సర్పంచ్ ఎన్నుకుంటే ఇప్పుడు అక్కడి ఎంపీటీసీ అభ్యర్ధి మీద కావాలని అట్రాసిటీ కేసు పెట్టారు. మన నాయకులంతా బలంగా నిలబడ్డారు. అవసరం అయితే జైలుకి వెళ్తాంగానీ ఎంపీటీసీ నామినేషన్ ఉపసంహరించుకోబోమన్నారు. అటువంటి నాయకులు, జనసైనికులు మన పార్టీలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీకు అండగా నిలబడడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారి నాయకత్వంలో  కచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది.  అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేస్తాం. శ్రీమతి రత్నప్రభ గారి లాంటి ఎంపీ మనకి అవసరం. ఆమె విజయం కోసం ఈ పది రోజులు శ్రమించి కష్టపడండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరంతా బాధ్యతగా పని చేయాలి” అన్నారు.

* బీజేపీ – జనసేన కూటమే ప్రత్యామ్నాయం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  శ్రీ సోము వీర్రాజు గారు

ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది గూండాగిరి ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ధ్వజమెత్తారు. ఈ రౌడీ రాజ్యానికి, అవినీతి రాజ్యానికి చరమగీతం పాడాలి. లాండ్, శాండ్, లిక్కర్ మాఫియాలను తరిమి కొట్టాలి. ఇదంతా దేశభక్తిని పుణికిపుచ్చుకున్న బీజేపీ, జనసేన కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది. అక్రమాలకు మారుపేరుగా మారిన వాలంటరీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేలా కార్యకర్తలను తీర్చిదిద్దుతాం. ఇలా రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమానికి తిరుపతి ఎన్నిక ద్వారానే శ్రీకారం చుడతాం. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తామంటున్న పార్టీలు మరి తిరుపతిలో ఎందుకు పోటీ చేస్తున్నాయో చెప్పాలని శ్రీ సోము వీర్రాజు గారు నిలదీశారు. ఉప్పెనలా తరలివచ్చిన జనసైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

* బెయిల్ మీద తిరిగే వారికి జైలు భయం ఉండాలి: శ్రీ సునీల్ దేవధర్ గారు

బెయిల్ మీద బయట తిరిగే వారికి జైలు భయం ఉండాలని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కో-ఇన్చార్జి శ్రీ సునీల్ దేవధర్ గారు చురక అంటించారు. వకీల్ సాబ్ సినిమా 9న రిలీజ్ అవుతోంది….ఆ రోజే శ్రీమతి రత్నప్రభ గారి విజయం డిక్లేర్ అవుతుంది. వైసీపీ గూండాగిరిపై గబ్బర్ సింగ్ యుద్ధం చేస్తారు. తిరుపతి ఎన్నికతో బీజేపీ – జనసేన జైత్రయాత్ర మొదలవుతుంది. అది కనకదుర్గమ్మ దీవెనలతో అమరావతికి చేరుతుంది. అసెంబ్లీపైన మన జెండా రెపరెపలాడుతుంది. దీనిని నెరవేర్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పోరాడదాము అన్నారు.

ఖజానా ఖాళీ… ప్రభుత్వం సున్నా… ఇదీ ఏపీ ప్రభుత్వ దుస్థితి: తిరుపతి లోక్ సభ అభ్యర్థి శ్రీమతి రత్నప్రభ గారు

ఒకప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా.. .ఆర్థికంగా బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధి శ్రీమతి రత్నప్రభ గారు విమర్శించారు. రెండేళ్లుగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఖజానా ఖాళీ, ప్రభుత్వం సున్నా…. ఇదీ నేటి రాష్ట్ర ప్రభుత్వ దుస్థితి. పారిశ్రామికవేత్తలు రావడం లేదు. కొత్త ఉద్యోగాల ఊసే లేదు. ఈ పరిస్థితి మారాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ – జనసేన కూటమిని గెలిపించాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కొత్త దారి చూపిస్తాం. ఏమీ లేని చోటకు వెళ్లి ఐ.ఎ.ఎస్. ఆఫీసరుగా అక్కడ ఎంతో అభివృద్ధి సాధించిన చరిత్ర నాది. నేను ఫైటర్ ను….ఫైర్ బ్రాండ్ ను. ఆ అంశాలను పక్కన పెట్టి నన్ను ట్రోల్ చేయడమేమిటి? నా తమ్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అండగా ఉన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించిన ప్రేమ, అభిమానం, ఉత్సాహం చూసి నాకు నిజంగా దిమ్మ తిరిగింది. ధన్యవాదాలు అంటూ చేతికి తువాలు చుట్టి ఇదే రాఖీ అంటూ తన ప్రసంగాన్ని శ్రీమతి రత్నప్రభ గారు ముగించారు. ‘‘కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చుగాని రావడం మాత్రం పక్కా’’ అంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ని వినిపించి అశేష జనవాహినితో చప్పట్లు కొట్టించారు. 

ఈ సభలో జనసేన పి.ఏ.సీ. సభ్యులు డా.పి.హరిప్రసాద్, శ్రీ చిలకం మధుసూధనరెడ్డి, శ్రీ సీహెచ్ మనుక్రాంత్ రెడ్డి, తిరుపతి అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్, ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ షేక్ రియాజ్, బీజేపీ నేతలు శ్రీ సి.ఆదినారాయణ రెడ్డి, శ్రీ పి.వి.ఎన్.మాధవ్, శ్రీ కోలా ఆనంద్, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ భానుప్రకాష్ రెడ్డి, శ్రీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.