ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగలిపింది

ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగలిపింది

* వైన్ షాపుల ముందు క్యూలైన్లు నిర్వహించే పనులు అప్పగించింది వైసీపీ ప్రభుత్వం

* గురువుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాం

* కృష్ణాగుంటూరు జిల్లాల నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

చదువుసంధ్యలతోపాటు లోకజ్ఞానాన్ని, మంచి నడవడికను నేర్పించే ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల్లో పద్దులు రాయడానికి, వైన్ షాపుల ముందు క్యూ లైన్లు సరిచేసే వాచ్ మ్యాన్ పనులకు ఉపయోగించి అవమానించిందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే పెద్దల సభగా పిలవబడే శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు వినిపించడానికి బలమైన గొంతు అవసరమని, అలాంటి వ్యక్తే  ప్రముఖ న్యాయవాది శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారని అన్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్న ఆయన్ని జనసేన పార్టీ బలపరుస్తుందని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణా, గుంటూరు జిల్లా జనసేన నాయకులు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో కలిశారు.  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం గురించి చర్చించారు. అందులో భాగంగా న్యాయవాది శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారిని ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “మనం పెద్దల సభగా పిలుచుకునే శాసనమండలిలో ఉపాధ్యాయ ప్రతినిధులను ఎన్నుకోడానికి త్వరలో ఎన్నిక జరగబోతోంది.  ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, వారి ఆత్మగౌరవం కాపాడడానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ అవకాశాన్ని మనకు కల్పించారు. ఆచార్య దేవోభవ అంటాం. ఆచార్యుడు అంటే అన్నీ నేర్పేవాడని అర్థం. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచే దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని అధిరోహించారు. అందువల్లే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా గౌరవం.

* గురువులను ఎన్నో సమస్యలు పీడిస్తున్నాయి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధ్యాయులు , అధ్యాపకులు మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అటువంటి గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారిని అనేక సమస్యలు పీడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్లుగా కొత్త పే రివిజన్ కమిషన్ (పి.ఆర్.సి) కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పి.ఆర్.సి. ని రివైజ్ చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. ఏటా రెండుసార్లు ఇచ్చే కరవు భత్యం (డి.ఎ) ఐదు విడతల నుంచి పెండింగ్ లో ఉంది.

ఈ రెండు సమస్యలతోపాటు టీచర్లు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య బదిలీలు. కుటుంబాన్ని ఒకచోట వదిలేసి, వీళ్లు ఇంకొక చోట విధులు నిర్వర్తిస్తూ చాలా అవస్థలుపడుతున్నారు. కుటుంబ సమస్యల దృష్ట్యా, మానవతా దృక్పథంతో బదిలీ కోరినా ఎన్నో ఆటంకాలు. బదిలీలపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి సరైన విధివిధానాలు లేవు. అధ్యాపక వృత్తి నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరిపై చాలా అదనపు భారం పడుతోంది. ఉపాధ్యాయ వృత్తితో పాటు బోధనేతర పనులు అప్పగించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. తాజాగా ప్రభుత్వ పథకాలైన అమ్మఒడి, నాడు – నేడు వంటి పథకాల నిర్వహణ పనులను కూడా ఉపాధ్యాయులపై ప్రభుత్వం మోపింది.

* శ్రీ గాదె వెంకటేశ్వర రావు గారిని బలపరుద్దాం

ఈ పరిస్థితి మారాలంటే  కుల, మతాలకు అతీతంగా ఏ సమయంలో అయిన ప్రజలకు అండగా నిలబడే శ్రీ గాదె వెంకటేశ్వర రావు లాంటి వ్యక్తులు రావాలి. గతంలో చాలా సార్లు ఆయనతో మాట్లాడాను. ఉపాధ్యాయల సమస్యలపై క్షుణ్ణమైన అవగాహన ఉంది. ఇలాంటి వ్యక్తి పెద్దల సభలో అడుగుపెడితే చాలా బలంగా మాట్లాడతాడని ఆరోజే అనిపించింది. శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని అందరం బలపరుద్దాం. వారిని గెలిపించి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని” అన్నారు. ఈ సమావేశంలో శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ పోతిన మహేష్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ కమతం సాంబశివరావు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ అమ్మిశెట్టి వాసు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

On this website we use first or third-party tools that store small files (cookie) on your device. Cookies are normally used to allow the site to run properly (technical cookies), to generate navigation usage reports (statistics cookies) and to suitable advertise our services/products (profiling cookies). We can directly use technical cookies, but you have the right to choose whether or not to enable statistical and profiling cookies. Enabling these cookies, you help us to offer you a better experience.